మంగళగౌరీవ్రత మహాత్యం

0
పెళ్లయిన స్త్రీలు సౌభాగ్యం కోసం చేసే శ్రావణ మంగళవారం నోముకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రద్ధతో తనను కొలిచే వారిని మంగళగౌరీ ఎంతటి త్యాగానికయినా సిద్ధపడి కన్నబిడ్డల మాదిరిగా కాపాడుతుందనడానికి చక్కటి కథ ప్రచారంలో ఉంది.
కృతయుగంలో దేవతలు, దానవులు అమృతాన్ని ఆశించి క్షీరసాగర మథనం చేసే సమయంలో ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం విరజిమ్మింది. భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని వేడుకోగా తన కర్తవ్యమేమిటో సెలవివ్వవలసిందిగా పార్వతి వంక చూశాడు. భర్త అంతర్యం గ్రహించిన పార్వతీమాత బిడ్డల యోగక్షేమాలను కాంక్షించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ తన మాంగల్యసౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసం ఉంచి, లోక వినాశనానికి కారణభూతమైన కాలకూట విషాన్ని పరమేశ్వరుడు మింగడానికి అనుమతించిందని చెబుతారు.
అంతటి త్యాగమూర్తి, సర్వమంగళ స్వరూపిణియైన శ్రీ భవానీమాతను శ్రీ మంగళగౌరీ వ్రతం పేరిట నూతనంగా వివాహమైన స్త్రీలు కొలిస్తే సౌభాగ్యంతో వర్థిల్లుతారని నమ్మకం. వివాహిత స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని ఆరంభించి వరుసగా ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరిస్తే అటువంటి స్త్రీలకు శ్రీ మంగళగౌరీ కటాక్షం లభించి వైధవ్య బాధలు లేకుండా జీవితాంతం సర్వసౌఖ్యాలతో తులతూగుతారని పురాణాలు పేర్కొంటున్నాయి.
మొదట సూతమహాముని నైమిశారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులకు వివిధ పురాణగాథలను చెబుతున్న సందర్భంలో ఈ మంగళగౌరీ వ్రతం గురించి వివరించారని, అనంతరం నారదుడు సావిత్రీ మాతకు వ్రతాన్ని ఉపదేశించాడని చెబుతారు. శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతం గురించి ద్రౌపదికి ఎరుకపరిచి ఈ వ్రతాన్ని చేయించాడు.
వ్రత మహాత్యం
పూర్వం మహిష్మతీ నగరాన్ని జయపాలుడు అనేరాజు పాలించేవాడు. ఆయనకు సౌశీల్యవతి అయిన భార్య లభించింది. దైవభక్తి పరాయణులైన ఆ దంపతులు సంతానం లేదన్న లోటుతో బాధపడేవారు. సంతానం కోసం వారు చేయని నోములు లేవు. వ్రతాలు లేవు. ఎన్నో దానాలూ, ధర్మాలూ చేశారు. ఆర్తత్రాణ పరాయణుడైన పరమేశ్వరుడికి ఆ దంపతులపై అనుగ్రహం కలిగి వృద్ధ సన్యాసి వేషంలో బయలుదేరాడు. అంతఃపుర ద్వారం వద్ద సన్యాసి వేషంలో ఉన్న పరమేశ్వరుడు మధ్యాహ్న సమయాన వచ్చి భవతీ బిక్షాందేహిఅని పిలిచి క్షణకాలమైనా ఉండకుండా వెళ్లిపోయేవాడు. బిక్ష వేయడానికి బయటకి వచ్చేసరికి సన్యాసి వెళ్లిపోతుండడంతో మహారాణి బాధపడింది. అయితే జయపాలుడిచ్చిన సలహా మేరకు మరునాడు మహారాణి మధ్యాహ్న సమయానికంటే ముందే బిక్షతో సన్యాసి కోసం ఎదురుచాడసాగింది. అయితే భిక్షువురూపంలో పరమేశ్వరుడు బిక్ష స్వీకరించడానికి నిరాకరిస్తాడు. పుత్రపౌత్రులు లేని వారి వద్ద బిక్ష స్వీకరించనని తేజోమూర్తిగా భాసిల్లుతున్న బిక్షువు అనడంతో మహారాణి ఆయన సామాన్య సన్యాసి కాదని గ్రహించి సంతానప్రాప్తి కోసం ప్రార్థిస్తుంది. కరుణాసముద్రుడైన పరమేశ్వరుడు తాను చెప్పిన పలుకులు భర్తకు చెప్పి ఆవిధంగా చేస్తే సంతానభాగ్యం కలుగుతుందని చెప్పి అదృశ్యుడవుతాడు.
మహారాణి ద్వారా విషయం తెలుసుకున్న జయపాలుడు సమీప అరణ్యంలో ఉన్న భవానీమాత ఆలయంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తాడు. ఆ తల్లి ప్రత్యక్షమై నీకు కోరినంత ధనం కావాలా? లేక సంతానం కావాలా అని అడుగగా, జయపాలుడు సంతానాన్ని కోరతాడు. అచిరకాలంలో వైధవ్యం పొందే కుమారై కావాలా? లేక సజ్జనుడు, అల్పాయుష్కుడైన కుమారుడు కావాలా? అని అమ్మవారు అడుగగా కుమారుణ్ణి ప్రసాదించమని జయపాలుడు వేడుకుంటాడు. అయితే గుడి వెనుక మామిడిచెట్టు నుంచి ఒక పండు కోసి నీ భార్యను తినమని, తద్వారా నీ కోరిక తీరుతుందని చెప్పి భవానీమాత అదృశ్యమైంది. జయపాలుడు అత్యాశతో మామిడి పళ్లన్నీ కోసి మూటకడుతుంటే గణపతి చూసి అతనికి పుట్టబోయే కొడుకు పదహారు సంవత్సరాలకు పాము కరిచి మరణిస్తాడని శపించాడు. మామిడిపళ్ళన్నీ మాయమై ముటలోఒక్కటే పండు మిగిలింది. జయపాలుడు ఆ పండును భార్యకిచ్చాడు. అమ్మవారి అనుగ్రహంతో పండుతిన్న రాణి గర్భవతియై తేజోవంతుడైన కుమారుడికి జన్మనిచ్చింది. శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతూ అన్ని విద్యలూ నేర్చుకున్నాడు. పెళ్లి చేస్తే ఆయుష్షు పెరుగుతుందనే నమ్మకంతో ఆ విషయం భర్తకు చెబుతుంది రాణి. మహారాజు అంగీకరించే ముందు శివుణ్ణి కాశీయాత్ర పూర్తి చేసి రమ్మని మేనమామని తోడిచ్చి పంపుతాడు. మార్గం మధ్యలో ప్రతిష్ఠానపురంలో మామాఅల్లుళ్లు బసచేస్తారు. అక్కడ కొందరు ఆడపిల్లలు ఆడుతూ పాడుతూ చివరకు దెబ్బలాటలకు దిగి ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఒక పిల్ల మరొక పిల్లను ముండలు, రండలుఅని తిడుతుంది. అందుకు సుశీల అనే పిల్ల తామంతా భవానీమాత భక్తులం కాబట్టి తమ ఇంట అటువంటి వారెవరూ ఉండరని బదులిస్తుంది.
ఆ సాయంత్రమే సుశీలతో కలిసి తండ్రి ఆలయానికి వచ్చి ఆమెకు మంచి వరుణ్ణి ప్రసాదించమని వేడుకుంటాడు. శివుని మేనమామ ఆలయం వెనుక భాగంలో నిలిచిన సుశీలకు తగిన వరుడు శివుడని, ఇప్పుడతడు అదే ఆలయంలో ఉన్నాడని పలుకుతాడు. సుశీల తండ్రి అది విని శివుణ్ణి గుర్తించి అతడు తన బిడ్డకు పరమేశ్వరుడు నిర్ణయించిన భర్తేనని భావించి వారిద్దరికీ పెళ్లిచేస్తాడు. ఆ రోజు రాత్రి సుశీల కలలో మంగళగౌరి దర్శనమిచ్చి నీ భర్త ఆయుష్షు నేటితో తీరిపోతుంది. కాసేపటికి ఒక కృష్ణసర్పం అతన్ని కాటువేయబోతుంది. కాని నీవు ఏమాత్రం భయపడకుండా సర్పం ముందు ఒక పాలకుండ వుంచు. పాముపాలుతాగుతూ కుండలోనికి ప్రవేశించగానే దానిపై గుడ్డనువేసి కుండమూతి గట్టిగా బిగించి మరుసటి ఉదయం నీ తల్లికే వాయనం ఇవ్వు. దాంతో నీ భర్తకు గండం గట్టెక్కుతుంది” అని సూచించింది. మరుసటి దినం తల్లికి కుండను వాయనమివ్వగా దాంట్లో ముత్యాలహారం కనిపిస్తుంది. శివుడు సుశీలకు తన వేలి ఉంగరం తొడిగి మేనమామతో కాశీకి వెడతాడు. సుశీల తన భర్త త్వరగా తిరిగి రావాలని ఒక సత్రం కట్టించి బాటసారులకు అన్నదానం, వస్త్రదానం, తాంబూలదానం ఇస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. శివుడు మేనమామతో కాశీ నుండి తిరిగి వస్తాడు. సుశీల కట్టించిన సత్రంలో బసచేసి ఆమె ఆతిథ్యం స్వీకరించి, ఆమె చేతి ఉంగరం చూసి తన భార్యగా గుర్తించి ఆదరిస్తాడు. భర్తను తల్లిదండ్రుల వద్దకు తీసుకెడుతుంది సుశీల. వారు శివుణ్ణి చూసి సంతోషించి మంగళగౌరిని పూజించి కుమార్తెతో మంగళగౌరి వ్రతం చేయించి సంప్రదాయసిద్ధంగా అత్తవారింటికి సాగనంపుతారు.
గండం గడచి దీర్ఘాయుష్షువంతుడై భార్యతో కలిసి వచ్చిన శివుణ్ణి చుసి రాజదంపతులు ఎంతో సంతోషిస్తారు. మేనమామ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని భవానీమాత ఆలయానికి వెళ్ళి ఆమెకు పూజచేసి దీవెనలందుకుని కోడలి చేత యథావిధిగా మంగళగౌరీవ్రతం చేయించి ప్రజలందరికీ వ్రత మహాత్మ్యాన్ని వివరించి, వారిచే ఆ వ్రతాన్ని చేయిస్తారు.
త్రిపురాసురుణ్ణి సంహరించే ముందు పరమేశ్వరుడు కూడా సర్వశక్తి సంపన్నురాలయిన గౌరీదేవిని పూజించి విజయం పొందాడు. ఆ తల్లిని పూజించిన కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. ఈ మంగళ గౌరీ వ్రతాన్ని కొత్తగా పెళ్లయిన స్త్రీలు ఆచరిస్తే సర్వసౌభాగ్యాలు పొందుతారు.

Leave A Reply