శ్రావణ పూర్ణిమ – రక్షాబంధనం

0 57

భారతీయ సంప్రదాయములో రాఖి పౌర్ణమి విశిష్టమైన స్థానం కలిగివుంది. ఈ పండుగను రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, జంద్యాల పూర్ణిమ, వైఖానస మహర్షి జయంతి గాను, హయగ్రీవ జయంతి గాను , వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. అందం, బంధం కలగలసిన పండుగ రాఖీ పౌర్ణమి. ఈ పండుగకు పురా ణాల ప్రకారం ఎన్నో అర్థాలున్నా, అన్నా చెల్లెళ్ల బాంధవ్యానికి, బాధ్యతకు ప్రతీకగానే దీనికి ఎక్కువ గుర్తింపు ఉంది.

పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.

అన్నదమ్ములు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తే అక్కచెల్లెలు వారికి హారతి ఇచ్చి, కుంకుమ దిద్ది, తీపి పదార్థాలను తినిపిస్తారు. అలాగే, రాఖీ కట్టి హారతి ఇచ్చి, కానుకలు ఇచ్చి పుచ్చుకోవడమూ ఆనవాయితీ! మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలోని వారు ఈ రోజున సమువూదాని కెళ్లి పూజ చేసి కొబ్బరికాయలను సమర్పిస్తారు. అందుకే, దీన్ని ‘నారికేళ పూర్ణిమ’, ‘నార్లీ పున్నమి’ అని కూడా అంటారు.
శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి . జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు

శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయమేనని తెలుస్తోంది.

 

 

Leave A Reply

Your email address will not be published.