గోత్రాలు ఎలా వచ్చాయి?

0
మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు పూజారి పూజ చేయాలంటే ముందుగా మన గోత్రం అడుగుతుంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. గోత్రం చెప్పగానే ఆ సంకల్ప మంత్రాలలో ఇది కూడా చేర్చి పూజ చేస్తుండడం మనం సాధారణంగా చూసే సందర్భం. కొన్నిసార్లు కొంతమంది తమను పరిచయం చేసుకునే సందర్భంలో ప్రవర చెప్తారు – అంటే ఏ గోత్రీకులు, తాము ఎవరి సంతానం వంటి విషయాలు తెలియజేస్తారు.
అయితే ఈ గోత్రాలు అంటే ఏమిటి? ఎలా వచ్చాయి… తెలుసుకుందాం .
సృష్టి మొదలు కాక ముందు పరమాత్మ వేద విజ్ఞానాన్ని అంతా సృష్టికర్త అయిన బ్రహ్మకు తెలియచేశాడు. బ్రహ్మ నుంచి ఈ విజ్ఞానం – దాన్ని అందుకుని, సంరక్షించి తరువాతి తరాలకు అందచేయగలిగే సామర్ధ్యం వున్న మహర్షులకు చేరింది. అటు తరువాత బ్రహ్మ మానసపుత్రులైన 27మంది ప్రజాపతులకు కూడా ఈ విజ్ఞానం అందించబడింది. వీళ్ళే ప్రపంచం అంతటా సృష్టికి కారణమైన వారు. వీరిలో ప్రతి ఒక్క ప్రజాపతి సంతానాన్ని ఒక గోత్రం వారిగా పరిగణించారు. ఇలా 27 గోత్రాలకు ఈ 27మంది ప్రజాపతులు మూలపురుషులు అయ్యారన్నమాట. వేద మంత్రాలను దర్శించిన ఈ మంత్ర ద్రష్టలను మహర్షులు అన్నారు. ఇందులో ప్రధానమైన ఏడుగురు ఎవరంటే – కశ్యప, వశిష్ఠ, భరద్వాజ, కపిల, అత్రి, విశ్వామిత్ర, గౌతములు. వీరు కాక బ్రహ్మ ఇతర పుత్రులైన స్వాయంభువ మనువు, అధర్ముడు, ప్రహేతి, హేతి, అరిష్టనేమి, భ్రుగువు, దక్షుడు, ప్రచేతసుడు, స్థాణువు, సంశ్రయుడు, శేషుడు, వికృతుడు, కర్దముడు, క్రతువు, పులహ, పులస్త్యుడు, అంగీరసుడు, మారీచుడు, అగస్త్యుడు కూడా గోత్రాల వ్యాప్తికి కారణమయ్యారు. వేదకాలం నుంచి ఉన్న భారతీయులంతా వీరిలో ఒకరి సంతానానికి సంతానం అయివుంటారు. అంటే వీరి గోత్రానికి చెందిన వారై వుంటారు అన్నమాట. అంటే మన కుటుంబాలకు, వంశాలకు వేదకాలానికి చెందిన ఫలానా విజ్ఞానవంతులు అయిన ఋషులు మూలపురుషులని మనం తెలుసుకోవడం, తెలియచెప్పడం – మనకి తెలిసినా తెలియకపోయినా మనం ఒక విలువైన వంశానికి వారసులం అన్నమాట.  అయితే తరువాతి కాలంలో అనేక గోత్రాలు కూడా ఈ వరసలో వచ్చి చేరాయి. ఇప్పుడు మొత్తం రెండు వందల నలభై తొమ్మిది గోత్రాలు వున్నా, వాటిలో ఒక నలభై మాత్రమె మనం సాధారణంగా చూస్తుంటాం. వీటిలో వార్దూలస, ఆత్రేయస, గార్గేయస, కౌన్డిన్యస, కౌశికస, గౌతమస, నైద్రువ-కశ్యప, హరితస, శాండిల్యస, భారద్వాజస, మౌద్గల్యస, శ్రీవత్సస గోత్రాలు తరచూ వినపడతాయి.  అలాగే ఏకార్షేయం, ద్వయార్షేయం, త్రయార్షేయం, పంచార్షేయం, సప్తార్షేయం అన్న విభాగాలు కూడా వున్నాయి. సాధారణంగా ఈ గోత్రాల వారు ఇతర గోత్రాల వారిని మాత్రమె వివాహం చేసుకుంటారు – అలా చేయడం వల్ల పుట్టుకలో లోపాలు, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నది వారి నమ్మకమే కాక వేద ప్రకటితమైన సత్యం కూడా.

 

ఏది ఏమైనప్పటికీ, సృష్టి మూలం దాకా మీ చరిత్ర తెలియచేసే ఈ గోత్రాల గురించి, దాని మూలపురుషులైన మహితాత్ముల గురించి తెలుసుకోవడం ద్వారా – మనం కూడా ప్రేరణ పొంది, సత్కార్యాలను ఆచరించి సమాజ హితానికి దోహద పడదాం?

Leave A Reply