ఆంజనేయ వ్రతం

0 67

ఆంజనేయుడు అమిత పరాక్రమవంతుడే కాదు … అంతకు మించిన జ్ఞాని. కొండలను పిండిచేసే శక్తిమంతుడు అయినప్పటికీ, అహంకరించలేదు … ఎవరినీ అవమానించనూ లేదు. బుద్ధి సూక్ష్మతను … అణకువను అలంకారంగా కలిగిన ఆంజనేయుడు, ధర్మబద్ధంగా నడచుకునే అందరి పట్ల వినయవిధేయతలను ప్రదర్శించాడు. ధర్మానికి ప్రతిరూపమైన రామచంద్రుడికి సేవ చేయడమే తన జీవితానికి పరమార్ధమని భావించాడు.
అలాంటి హనుమంతుడిని ఎంతోమంది భక్తులు తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తుంటారు … ఆయన సేవలో తరిస్తుంటారు. మంగళవారాలతో పాటు హనుమజ్జయంతి రోజున స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో హనుమంతుడికి సంబంధించిన విశిష్టమైన రోజులలో ‘మార్గశుద్ధ ద్వాదశి’ ఒకటిగా చెప్పబడుతోంది. ఈ రోజున హనుమంతుడి వ్రతాన్ని ఆచరించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
హనుమంతుడి వ్రతాన్ని చేయదలచుకున్న వాళ్లు, ముందురోజు రాత్రి నుంచి ఉపవాస దీక్షను చేపట్టాలి. మరునాడు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా మందిరంతో సహా ఇంటిని పరిశుద్ధపరిచి, వాకిట్లో ముగ్గులు వేసి … గుమ్మానికి తోరణాలు కట్టాలి. ఆ తరువాత హనుమంతుడి చిత్ర పటానికి గంధం … కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలతో అలంకరించాలి. హనుమంతుడి వెండి ప్రతిమకు షోడశోపచారాలతో పూజించాలి.
ఆ తరువాత స్వామివారికి గోధుమ పిండితో తయారుచేసిన అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ సాయంత్రం పునఃపూజ చేసిన తరువాత చంద్రోదయాన్ని చూసుకుని ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా స్వామిని సంతోషపెట్టడం వలన, కార్యసిద్ధి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. హనుమంతుడి వ్రతాన్ని ఆచరించడం వలన బుద్ధి వికసిస్తుందనీ … ఏకాగ్రత పెరుగుతుందనీ … అనారోగ్యాలు నశించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని స్పష్టం చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.