హోలీ పండుగ ప్రత్యేకత

1

తెలుగు మాసాలలో చివరిదైన ‘ఫాల్గుణ మాసం’ అంటే శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఎందుకంటే స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైన లక్ష్మీదేవి ఉద్భవించినది ఈ మాసంలోనే. ఈ కారణంగానే లక్ష్మీ నారాయణులను ఆరాధించడానికి ఈ మాసం అన్ని విధాల అనుకూలమైనదని అంటారు. ఇంతటి విశిష్టతను కలిగిన ఈ మాసంలోనే ‘హోలీ’ పండుగ వస్తుంది.
రెండు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ, సఖ్యతకు … సామరస్యానికి అద్దం పడుతూ వీధులను రంగుల మాయం చేస్తుంది. జీవితం రంగులమయం కానుందనే ఆశను రేకెత్తిస్తుంది. ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున ‘కామదహనం’ … ఫాల్గుణ పౌర్ణమి రోజున హోళికా పూర్ణిమ (కాముని పున్నమి) పేరుతో ఉత్సాహంగా సంబరాలు జరుగుతుంటాయి. లోక కల్యాణానికి గాను పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపించాలని దేవతలు నిర్ణయించుకుంటారు. పార్వతీ దేవి పట్ల పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని అంతా మన్మధుడిని కోరతారు.
అలవాటు ప్రకారం శివుడి పైకి మన్మథుడు బాణాన్ని ప్రయోగించి, ఆయనకి తపోభంగాన్ని కలిగిస్తాడు. ఆగ్రహావేశాలకి లోనైన శివుడు … తనలో కోరికలు కలిగించడానికి ప్రయత్నించిన మన్మథుడిని తన మూడవ కన్నుతో భస్మం చేస్తాడు. కోరికలు దహింపజేసిన రోజు కావడం వలన ఈ రోజు ‘కామదహనం’ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. కోరికలను నియంత్రించిన వారే ఉత్తమైన మార్గంలో ప్రయాణించి ఉన్నతమైన స్థానాలను చేరుకుంటారనే సందేశాన్ని ఇవ్వడమే ఈ పండుగ పరమార్థంగా కనిపిస్తూ ఉంటుంది.
ఈ సంఘటనను పురస్కరించుకుని కొన్ని ప్రాంతాలలో గడ్డితో చేసిన మన్మథుడి బొమ్మను తగులబెట్టడాన్ని సామూహిక ఉత్సవంగా నిర్వహిస్తుంటారు. ఇక మరునాడైన పౌర్ణమి రోజునే, హోళికా అనే రాక్షసి సంహరించబడటం కారణంగా ఈ రోజుకి హోళికా పూర్ణిమ అనే పేరు వచ్చిందని అంటారు. ఇక హోళిక అంతం చేయబడటం వల్లనే కాదు, తన కారణంగా భస్మమైపోయిన మన్మథుడుకి శివుడు అదృశ్య రూపాన్ని ఇచ్చినది కూడా ఇదే రోజునని అంటారు.
ఈ కారణంగా కూడా ఈ రోజున సంతోషంతో అంతా కలిసి రంగులు చల్లుకుంటూ ఉంటారు. కష్టాలను తట్టుకుని నిలబడితే ఆనందాలు వస్తాయనే ఆశావహ దృక్పథాన్ని ఈ పర్వదినం ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇక ఈ రోజున ఉదయం వేళలో లక్ష్మీదేవిని ఆరాధించి, రాత్రివేళలో శ్రీ కృష్ణుడికి ‘పవళింపు సేవ’ ను నిర్వహించడం వలన సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.

Discussion1 Comment

Leave A Reply