ప్రపంచంలోని అనేక ప్రాచీన నాగరికతలను పరిశీలిస్తే, అందరూ కూడా సూర్యనారాయణ మూర్తిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధించిన దాఖలాలు కనిపిస్తాయి. సమస్త ప్రాణికోటి జీవనాధారానికి సూర్యభగవానుడు మూలమని అప్పట్లోనే అందరూ గ్రహించారు. తమని చల్లగా చూడమని ఆ స్వామిని అనునిత్యం పూజించారు.
ఆ తరువాత తరాలవారు కూడా సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా భావించి ఆరాధించసాగారు. ఈ కారణంగానే ప్రాచీనకాలంనాటి సూర్య దేవాలయాలు తమ వైభవాన్ని కోల్పోకుండా వెలుగొందుతూ వున్నాయి. ఇక పురాణాలను … ఇతిహాసాలను పరిశీలిస్తే సూర్యారాధనకి ఆ కాలంలో గల ప్రాధాన్యత అర్థమవుతుంది. అలాంటి సూర్యభగవానుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే రోజుగా ‘రథసప్తమి’ చెప్పబడుతోంది.
లోకాన్ని ఆవరించిన చీకట్లను పారద్రోలి వెలుగును ప్రసాదించడం కోసం సూర్యుడు వేయి కిరణాలను ప్రసరింపజేస్తూ వుంటాడు. ఈ వేయి కిరణాలలో ఏడు కిరణాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇందుకు సంకేతంగానే సూర్యుడు ఏడు గుర్రాలను కలిగిన రథంపై దర్శనమిస్తూ వుంటాడు. సూర్యుడు తొలిసారిగా ఈ రథాన్ని అధిరోహించి తన బాధ్యతలను చేపట్టిన రోజే ‘రథసప్తమి’ గా చెప్పబడుతోంది.
ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడం కోసమే ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని నక్షత్రాలు రథం ఆకారాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సూర్యుడు తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం బయలుదేరాడనటానికి సూచనగా … ఆయనకి ఆహ్వానం పలుకుతూ ప్రతి వాకిట్లోను ఈ రోజున రథం ముగ్గులు కనిపిస్తుంటాయి. సూర్యభగవానుడికి ‘అర్కుడు’ అనే పేరుంది. అందువల్లనే ఆయనకి అర్కపత్రం (జిల్లేడు ఆకు) ప్రీతికరమైనదని అంటారు.
ఈ కారణంగానే రథసప్తమి రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకుని తలస్నానం చేస్తారు. కొత్తబట్టలు ధరించి భక్తిశ్రద్ధలతో సూర్యభగవానుడిని పూజిస్తారు. కొత్త బియ్యం – కొత్త బెల్లాన్ని కలిపి తయారుచేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రకృతి ద్వారా తమకి కావలసిన ఆహార పదార్థాలను అందిస్తోన్న సూర్యనారాయణమూర్తికి ఇది కృతజ్ఞతలు తెలియజేయడం లాంటిదని చెప్పుకోవచ్చు.
రథసప్తమి రోజున ప్రసరించబడే సూర్యకిరణాలు, అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన జిల్లేడును విశేషమైన రీతిలో ప్రభావితం చేస్తాయి. అందువలన ఈ రోజున జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయడం వలన వివిధ రకాల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని వైద్యశాస్త్రం చెబుతోంది. ఈ విధంగా సూర్యుడిని ఆరాధించడం వలన ఆధ్యాత్మిక పరమైన పుణ్యఫలాలతో పాటు ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాలు లభిస్తాయని ప్రాచీన గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
Discussion1 Comment
It’s laborious to find knowledgeable people on this topic, however you sound like you recognize what you’re talking about! Thanks