ఆరోగ్యాన్నే వరంగా అందించే వ్రతం

1

ఆరోగ్యమే మహా భాగ్యమని పెద్దలు ఏనాడో సెలవిచ్చారు. శ్రమించాడనికే కాదు … సుఖ పడటానికి కూడా ఆరోగ్యం ఎంతో అవసరం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి అవకాశం వుంటుంది. ఆరోగ్యమే లేనప్పుడు అనుభవించడానికి ఎన్ని వున్నా వాటి వలన ఎలాంటి ప్రయోజనం వుండదు. అందుకే ఆరోగ్యాన్ని ప్రసాదించమని భగవంతుడిని కోరని వాళ్లంటూ ఎవరూ వుండరు.
కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ కనిపిస్తుంటారు. ఎన్ని రకాల మందులు వాడినా పెద్దగా ఫలితం కనిపించలేదని చెబుతుంటారు. ఇలా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోన్న వాళ్ల కోసం … అనారోగ్యాలు దరిచేరకుండా జ్రాగ్రత్తపడే వాళ్ల కోసం ‘సూపౌదన వ్రతం’ చెప్పబడుతోంది.
ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం జరుగుతుందని స్పష్టం చేయడం జరుగుతుంది. ‘శ్రావణ శుద్ధ షష్ఠి’ రోజున ఈ వ్రతాన్ని ఆచరించవలసి వుంటుంది. ఉదయాన్నే స్నానం చేసి … పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి … శివుడిని షోడశ వుపచారాలతో సేవించవలసి వుంటుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదిదేవుడిని ఆరాధించి, పప్పుతో కూడిన అన్నాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించవలసి వుంటుంది.
ఉపవాస దీక్షను చేపట్టిన కుటుంబ సభ్యులంతా, పూజ అనంతరం ఈ నైవేద్యాన్నే ఆహారంగా తీసుకోవలసి వుంటుంది. రాత్రి ఆహారంగా పాలు – పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన అనారోగ్య బాధలు తొలగిపోయి, సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని చెప్పబడుతోంది.

Discussion1 Comment

Leave A Reply