ధనుర్మాస వ్రతం || Dhanurmasa Vratham

1
ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు మేషరాశి నుండి మొదలుపెట్టి… మొత్తం పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్ముడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తూనే ‘ధనుర్మాసం’ ప్రారంభం అవుతుంది. ఆ తరువాత సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు… అంటే పర్వదినం అయిన మకరసంక్రాంతికి ముందురోజయిన భోగి వరకు ఈ ‘ధనుర్మాసం’ వుంటుంది. ఈనెలరోజులపాటు తప్పనిసరిగా ‘ధనుర్మాస వ్రతం’ను ఆచరించాలి.
వ్రత విధానం : 
ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు మొదటగా వారు బంగారం లేదా వెండితో తయారుచేయబడిన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. ఒకవేళ మీకు ఇంత స్థాయి లేకపోతే.. మీ శక్తిమేరకు పంచలోహాలతోగాని, రాగితోగాని విష్ణువు విగ్రహాన్ని తయారు చేయించుకోవాలి. ఈ మాసంలో విష్ణువును ‘మధుసూదనుడు’ అనే పేరుతో వ్యవహరించాలి.ఈ మాసం మొదలైన మొదటిరోజు నుంచి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే రోజువారి కార్యక్రమాలను ముగించుకోవాలి. తలస్నానం చేసిన తరువాత నిత్యపూజలు, సంధ్యవందనాలను ముగించుకుని ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకోవాలి.
మొదటగా విష్ణువును ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. అందులో శంఖాన్ని ఉపయోగిస్తే శ్రేష్ఠం. తర్వాత తులసీ దళాలతోను, వివిధ రకాలైన పుష్పాలతోను స్వామివారిని నామాలతో పూజించుకోవాలి. మొదటి పదిహేను రోజులవరకు నైవేద్యంగా చెక్కర పొంగలిగాని, బియ్యం-పెసరపప్పుతో కలిపి వండిన ‘పులగం’నుగాని సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు ‘ఉధ్యోదనం’ నైవేద్యంగా సమర్పించాలి.  తర్వాత ధూప, దీప, దక్షిణ, తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామిని పూజించడంతోపాటు మీ బృందావనంలో వున్న తులసీని కూడా పూజించుకోవాలి. ఈ మాసమంతా విష్ణువుకు సంబంధించిన పురాణాల కథలను చదవడం లేదా వింటూ గడపాలి. విష్ణుదేవాలయాలను దర్శించుకోవాలి.
ఫలితాలు :
ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణాలలో కథనాలు కూడా వున్నాయి. ఈ వ్రతాన్ని చాలావరకు వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతుంది. దీంతోవారికి మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని తన భర్తగా పొందినట్లు పురాణాలలో కథనాలు వివరంగా చెప్పబడి వున్నాయి.

Discussion1 Comment

Leave A Reply